*తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!*

 

మన దునియా,నిజామాబాద్ జనవరి 28

*నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు..*

*తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!*

ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా. దీంట్లో చిక్కుకొని ఇప్పటికే చాలామంది కటకటాలపాలయ్యారు.

అయినా పరిస్థితి మారడం లేదు. తెలంగాణలో ఇటీవల చాలాచోట్ల ఈ దందా జోరుగా సాగుతోంది. తాజాగా.. వరంగల్ పోలీసులు ఓ ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి భారీగా నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

*8 మంది అరెస్టు..*

నకిలీ కరెన్సీని ముద్రించి, చలామణి చేస్తున్న ఎనిమిది మందిని కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ కరెన్సీ ముద్రణకు ఉపయోగించే కాగితంతో పాటు రూ.38.84 లక్షల నగదు, రూ.21 లక్షల విలువైన నకిలీ నోట్లు, ఒక కారు, తొమ్మిది మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*నాలుగు రెట్లు..*

లక్ష రూపాయల నిజమైన కరెన్సీకి.. నాలుగు రెట్లు విలువైన నకిలీ నోట్లను అందిస్తామని ఈ ముఠా ఆకర్షిస్తున్నట్టు.. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరించారు. *ఈ ముఠాలో ప్రధాన నిందితుడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మణికళ కృష్ణ (57) గా* గుర్తించారు. త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో, నకిలీ కరెన్సీని చలామణి చేయడానికి ఇతను ప్లాన్ వేశాడు. దీని కోసం, హన్మకొండకు చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్‌తో జతకట్టాడు.

*పట్టుకున్న పోలీసులు..*

శ్రీనివాస్ నకిలీ కరెన్సీని హన్మకొండలో తనకు అప్పగించాలని కోరాడు. కృష్ణ ఆ షరతుకు అంగీకరించి.. ఒప్పందం ప్రకారం, కృష్ణ, మరో నలుగురితో కలిసి శుక్రవారం రాత్రి వరంగల్ ఔటర్ రింగ్ రోడ్‌లోని పెగడపల్లి క్రాస్‌రోడ్‌కు కారులో వచ్చాడు. శ్రీనివాస్, మరో ఇద్దరు నిందితులు అప్పటికే అక్కడ ఉన్నారు. నోట్ల మార్పిడీ జరుగుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ బృందం వారిని పట్టుకుంది. వారిని ప్రశ్నించగా.. నిందితులు నేరం అంగీకరించారని కమిషనర్ చెప్పారు.

*గతంలోనే కేసులు..*

ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు కృష్ణపై గతంలో సత్తుపల్లి, వీఎం బంజర, లక్ష్మీదేవి పేట పోలీస్ స్టేషన్లలో రూ.500 నకిలీ నోట్లను ముద్రించి, తన స్నేహితులతో కలిసి చెలామణి చేసినందుకు కేసులు నమోదయ్యాయి. కేవలం వరంగల్ జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. అటు నల్గొండ నుంచి మహబూబ్ నగర్ వరకు ఇలాంటి దందాలే జరుగుతున్నాయే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల దేవుడి ఆలయ హుండీలోనూ నకిలీ కరెన్సీ బయటపడింది.

*హైదరాబాద్ టు బాన్సువాడ..*

ఇటీవల కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని ఓ వ్యాపారి దొంగనోట్లు చలామణి చేస్తున్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. ఎవరెవరిని కలుస్తున్నాడు? దొంగనోట్లు ఎలా సమకూర్చుతున్నాడు అనే వివరాలు సేకరించారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత గుట్టురట్టు చేశారు. అతను హైదరాబాద్‌ నుంచి బాన్సువాడకు, అక్కడి నుంచి బిచ్కుందకు నకిలీ కరెన్సీ తీసుకొస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

*మూలాలు ఎక్కడ..*

అయితే.. ఈ వ్యవహారంపై మూలాలపై పోలీసులు ఫోకస్ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చాలాచోట్ల నకిలీ కరెన్సీని పట్టుకుంటున్న పోలీసులు.. వాటి చలామణిని ఆపగలుగుతున్నారు. చలామణి చేస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు. కానీ.. ఎవరు తయారు చేస్తున్నారు.. ఎక్కడ తయారు చేస్తున్నారు.. చలామణి చేసేవారికి ఎక్కడి నుంచి దొంగనోట్లు వస్తున్నాయనేది మాత్రం తేల్చడం లేదు.

*అతను ఎవరు..*

వరంగల్‌లో దొరికిన ముఠా వెనక మరో వ్యక్తి ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అతనే నోట్లను ముద్రించి.. కృష్ణ వంటి వారికి సరఫరా చేస్తున్నాడని తెలుస్తోంది. పోలీసుల విచారణలో ముఠా సభ్యులు రవి అనే పేరును పోలీసులకు చెప్పారని తెలిసింది. కానీ.. ఆ రవి ఎవరో ఎవ్వరికీ తెలియదు. అతని దగ్గరే నోట్లను ముద్రించే మిషన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. చలామణి చేస్తున్న వారినే కాకుండా.. మూమాలపై దెబ్బకొడితే.. నకిలీ కరెన్సీ దందా ఆగే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *